RSS
Facebook
Twitter

Monday, 27 April 2015

 నా చెలీ ......

కవిత 




1.విరులవాన కురిసినట్టు 
వెన్నెలమ్మ నవ్వినట్టు 
పరిమళించు గంధమేదో
పరవశాన తాకినట్టు 
అరుదెంచెను నా చెలీ, అరుదెంచెను నా చెలీ 

2. ఎంచి మంచి ముత్యాలను
దోసిలిలో నింపినట్టు
బంగారము రంగరించి
సింగారము జేసినట్టు
కనిపించెను నా చెలీ, కనిపించెను నా చెలీ

3. చుక్కలలో మెరుపుదెచ్చి
తనువులోన నింపినట్టు
అవనిలోని అందమంత
అతివలాగ మారినట్టు
అమరిందోయ్ నా చెలీ , అమరిందోయ్ నా చెలీ

4. తపనపడే తలపులన్ని
వలపుతోటి మూటగట్టి
చిలిపిమనసు వాకిలినీ
ఒడుపుగాను తెరచిపెట్టి
వలచిందోయ్ నా చెలీ, నిలిచిందోయ్ నా చెలీ

5. ఆ దివినేలెడి ఒక దేవత
నా మది గుడిలో వెలసినట్టు
అమర సుధల నందించగ
నన్నే కరుణించినట్టు
ఒదిగిందోయ్ నా చెలీ ,నాలో కరిగిందోయ్ నాచెలీ

నాగజ్యోతీ సుసర్ల
14-02-2015 .

వోయ్ మావా వొయ్ మావా 

వెన్నెలంటి చల్లదనం
మల్లె పూల తెల్లదనం
నీ మనసుకు ఎవరిచ్చారోయ్ మావా వొయ్ మావా
చక్కదనపు చందనమూ
వలపు వింటి తియ్యదనము
కలగలిపిన నువ్విచ్చావోయ్ పిల్లా ఓ పిల్లా

అల్లరిమాటల చాటున
మమతల వెల్లువ చేష్టలు
నీకేలాగున వచ్చేశాయోయ్ మావా వొయ్ మావా
కలువకళ్ళ పిల్లదాని
మాటవిరుపు మేని మెరుపు
నాకన్నీ తెచ్చిచ్చాయోయ్ పిల్లా వొయ్ పిల్లా
చూపుల బాణాలు వేసి
చిన్నదాని మనసు దోచు
వాటము నీకెవరిచ్చారోయ్ మావా వొయ్ మావ
చిరునవ్వుల మురిపాలను
చెదరనీక కుశలమడుగు
నీ మనసే నాకిచ్చిందోయ్ పిల్లా వొయ్ పిల్లా
నాగజ్యోతీ సుసర్ల
23-04-2015

Saturday, 25 April 2015

ఉషస్సు





నమస్సులే వయస్సుకీ
వయస్సులో ఉషస్సుకీ
ఉషస్సునే వెలిగించే
హుషారు తెచ్చిన నా చెలికీ .....

నా మదిలో తొలి అలజడినే
రేపెనులే తన తెలి నవ్వే
దోసిలి లో నింపేశా
దోరగ విరిసిన ఆ నవ్వే

అపురూపం నా చెలి రూపం
కన్నులలోనే దాచేశా
కలలో తను నను కరుణించే
క్షణమే వరమై నిలిచేలా....

నాగజ్యోతి సుసర్ల.
12-01-2015

Friday, 24 April 2015

గణపతియైనమః

కందము:

తొలిగా  గణపతి ని దలచి
మలి నిన్నే కొలిచెదనుగ  - మాతా వాణీ!
కలమును వరముగ నీయరె ,
పలుకులనమృతమ్మొలికెడి - పధ్ధతి దెలియన్